2012 సుఖాంతం
డిసెంబర్21, 2012. ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెడుతున్న తేది. ఆరోజున ఈ మానవాళి అంతమైపోతుందన్న వాదనలు ఆ భయానికి హేతువు. మత చాంధసవాదులు, కుహనా శాస్తవ్రేత్తలు, హాలీవుడ్ దర్శకనిర్మాతలు తాజాగా ఎంచుకున్న సబ్జెక్ట్ ఈ 2012 ప్రళయం. ఎప్పుడో ఎక్కడో జరిగిన, విన్న చిన్నచిన్న విషయాలకు విపరీతాన్ని జోడించి, తమతమ వికృత ఊహలతో అటు ఆస్తికులను, ఇటు నాస్తికులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అంతర్గతంగా ఉండే మృత్యుభయాన్ని మరింత రాజుకునేలా చేసి వికటానందం పొందేవారు కొందరైతే, దాన్ని ఒక ‘ప్రొడక్ట్’లా మార్చి అమ్ముకునేవారు మరికొందరు. సినిమాల దగ్గరనుండి ఆఖరికి ప్రళయం సంభవిస్తే తమనుతాము కాపాడుకోవడానికి వీలు కల్పించే ‘రక్షణ కిట్లు’ కూడా అమ్మకానికి పెట్టారు.
వైజ్ఞానిక శాస్తప్రరంగా ఎటువంటి ఆధారమూ లేని ఈ ‘ప్రళయాలు’ ఇప్పటికే ఎన్నో వచ్చివెళ్లిపోయాయి. గతంలో వారు చెప్పినట్లు వచ్చివెళ్లిపోయిన ‘యుగాంతాల’ తర్వాత కూడా ఇప్పుడు మనం ఉన్నాం. మన భూమీ ఉంది. ఉంటాం కూడా. అటువంటి మరో సాధారణ తేదీనే 21 డిసెంబర్ 2012. ఆ తర్వాత కూడా వారు మరో తేదీ వెతుక్కుంటారు. మళ్లీ కథ మామూలే.
కలియుగాంతం గురించి ఇప్పటికే ఎన్నో భవిష్యవాణి కథనాలను మనం విన్నాం. వీరబ్రహ్మంగారు, నోస్ట్రడామస్ లాంటి చరిత్ర పురుషులు కూడా జరుగుతుందని చెప్పారు కానీ, అందులోని కాలగమన పరిస్థితులని అంచనా వేయడం అంత సులభం కాదని ఇప్పటికే తేలింది. అయితే ఏదోనాడు ప్రతీది తమ ఉనికిని కోల్పోవలసిందే. వయసైపోయిన జీవ, నిర్జీవ పదార్థాలన్నింటికీ కాలం చెల్లినట్లే, ఈ సృష్టి కూడా ఏదో ఒక రోజున అంతమైపోతుంది. అంతమాత్రాన అది 21 డిసెంబరు 2012 కానవసరంలేదు. అలా కావడానికి ఎటువంటి ఆధారమూ లేదు.
2012 యుగాంతానికి ప్రధానంగా ఈ ‘ప్రళయవాదులు’ (ఇకనుండి వీరిని ప్ర.వాలు గా చదువుకుందాం) చెపుతున్న కారణాలు ఐదు.
1. మయాన్ కాలచక్రం (Mayan Calender)
2. గ్రహకూటమి (Planetory Allignment)
3. ధ్రువ మార్పిడి (Polar Shift)
4. గ్రహఘాతం (Planetory Collision)
5. సౌర తుపానులు (Solar Storms)
వీటి గురించి వారి వాదనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాయ అనేది ఒక మెసోఅమెరికన్ నాగరికత. మాయన్లు కాలచక్ర గమనం గురించి రూపొందించిన క్యాలెండర్ లోని రోజులు సరిగ్గా 21 డిసెంబర్ 2012న ముగియబోతున్నాయి. ఆ తర్వాత ఏమిటనేది వారు చెప్పలేదు. సరిగ్గా ఈ పాయింటుమీదే ఈ ప్ర.వాలు యుగాంత వాదనను తెరమీదికి తెచ్చారు. తర్వాత ఏమిటనేది మాయన్లు చెప్పలేదు కాబట్టి, ఇక ఏమీ వుండదు అనే నిర్ణయానికి వీరు వచ్చేసారు.
గ్రహకూటమి:
సూర్యుడు, తన చుట్టూ భ్రమిస్తున్న భూమి, ఈ సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే గెలాక్సీ) కేంద్రం ఒకే సరళరేఖ మీదికి డిసెంబరు 21న వస్తాయని, దాంతో గెలాక్సీ కేంద్రంలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్ తన తీవ్రమైన గురుత్వాకర్షణ శక్తితో భూమిని తనలోకి లాక్కుంటుందని , అంతటితో భూమి చరిత్ర సమాప్తమని వీరి ఆరోపణ.
భౌతిక ధ్రువ మార్పిడి లేదా భూఅయస్కాంత ధ్రువ మార్పిడి:
మరొక వాదన ధ్రువమార్పిడి. భూకేంద్రం చుట్టూ ఉన్న ఉపరితల పొర ఒక్కసారిగా తిరిగిపోయి, ఉత్తర ధృవం దక్షిణ ధృవంగా, దక్షిణధృవం ఉత్తర ధృవంగా మారిపోతాయని, తద్వారా జరిగే ప్రతిచర్యలు దారుణంగా ఉంటాయంటున్నారు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏర్పడి ప్రళయం సంభవిస్తుందని ప్ర.వాల అభిప్రాయం.
గ్రహఘాతం(వేరే గ్రహం లేదా గ్రహశకలం భూమిని ఢీకొట్టడం) :
మాయన్ క్యాలెండర్ తర్వాత ఇదే అతి ముఖ్యమైన వాదన. బాహ్య సౌర వ్యవస్థలో తిరుగాడుతున్న ఒకానొక భారీ గ్రహ పదార్థం లేదా గ్రహం మన సౌర కుటుంబంలోకి చొరబడి, భూమిని ఢీకొట్టనుందని దాని సారాంశం. ఈ గ్రహాన్ని ‘ప్లానెట్-ఎక్స్’ అని ఆధునిక వాదులు, ‘నిబిరు’ అని మత, పురాతన సంప్రదాయ ప్రళయవాదులు వాదిస్తున్నారు. ఈ సంఘటన కూడా అదే తేదీన(21-12-12) జరుగబోతూందని వారి ఊహ (?).
సౌర తుపానులు:
ఖగోళశాస్త్రం గురించి కొంత తెలుసుకుని, కొంత తప్పుగా అర్థం చేసుకుని మిడిమిడి జ్ఞానంతో వాదిస్తున్న వారి వాదన ప్రకారం, సాధారణంగా సూర్యుడిపై సంభవించే సౌర తుపానులు 2012లో భారీయెత్తున లేచి తద్వారా భూమిపైనున్న అన్నిరకాల వ్యవస్థలు స్థంభించిపోతాయని, అలాగే భూమి లోపలిభాగంలో కూడా ఈ ప్రభావం పనిచేసి రకరకాల మార్పులు సంభవించి పెను ప్రమాదానికి దారితీస్తాయని వారి ఆందోళన.
ఈ పై అయిదు అంశాలలో ఒక ప్రత్యేకత ఉంది.
మాయన్ క్యాలెండర్, గ్రహ తాకిడి అనేవి మతవిశ్వాస వాదులను నమ్మించడంకోసమైతే, మిగిలిన మూడు కొన్ని శాస్త్ర విషయాలు, ఆధునిక విజ్ఞానం తెలిసిన వారి కోసం. ఎవరో కొంతమంది శాస్తజ్ఞ్రులు, నాస్తికులు తప్ప ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రెండు కోవలకు సంబంధించే ఉంటారు కాబట్టి, అందరూ నమ్మే అవకాశం చాలా ఎక్కువ. ఒక నిజం ప్రయాణించే వేగం కంటే పుకారు షికారు చేసే వేగం చాలా ఎక్కువని మనందరికి తెలుసు. ఎలాగూ సంచలన విషయాలను వాయువేగంతో ప్రపంచం నలుమూలలకు చేరవేసే మీడియా నెట్వర్క్ ఇప్పుడు అందరికీ అందు బాటులో ఉంది కనుక సమాచార మార్పిడి అసలు సమస్య కానేలేదు. ఇంటర్నెట్లో ఈ విషయంపై కొన్ని వందల సైట్లు ఇప్పటికే వెలిసాయి. కొన్ని వందల పుస్తకాలు ఇదే విషయంపై విడుదలయ్యి, మార్కెట్లో తిరుగుతున్నాయి. ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలమ్మే ప్రముఖ పోర్టల్ ‘అమెజాన్.కామ్’ కొన్ని వేల పుస్తకాలను, సిడిలను ఈ సరికే మార్కెట్ చేసేసింది.
గొప్ప గొప్ప ఖగోళ, భూవిజ్ఞాన శాస్తవ్రేత్తలు, చరిత్ర పరిశోధకులు, నాసా, ఇస్రో లాంటి వైజ్ఞానిక సంస్థలు వివరిస్తున్న నిజాలకు మీడియాలో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదు. ఎందుకంటే మంచికంటే చెడుకే పాపులారిటీ అధికం కాబట్టి.అయితే వేటిని నమ్మాలో, వేటిని నమ్మకూడదో తెలియజెప్పే క్రమంలో పై అయిదు ఆరోపణలపై సశాస్ర్తీయ వివరణలు, వాటిలోని నిజానిజాలు అవే పాయింట్ల వారీగా దిగువన..
మాయన్ క్యాలెండర్:
పై ఆరోపణల్లో అతిముఖ్యమైనది ఇదే. మాయన్లు క్రీ.పూ2000-క్రీ.శ 250 కాలంలో నివసించారని చరిత్ర చెబుతుంది. అందులో క్రీ.శ250 నుండి 900 వరకు వారి నాగరికత ఉచ్చదశలో ఉందని, అదే సమయంలో ఈ సుదీర్ఘ గణన క్యాలెండర్ నిర్మితమైనదని చరిత్రకారుల అంచనా.
మాయన్ సామ్రాజ్యం మెక్సికో దక్షిణ రాష్ర్టభాగాల చుట్టూ నిర్మితమై క్రమంగా గ్వాటిమొలా, ఎల్‌సాల్వడార్, బెలిజి లాంటి ప్రస్తుత ప్రాంతాలకు పాకింది. మాయన్ సమాజంలో నివసించిన ప్రజలు అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శించారు. పట్టణ ప్రణాళికలోనూ, నగరాలను నిర్మించడంలోనూ వీరికి అపార నైపుణ్యం ఉంది. అలాగే గణిత, ఖగోళశాస్త్రాలలోనూ. వీరి ఆధ్వర్యంలోనే పెద్ద పెద్ద పిరమిడ్లు, ఇతర పెద్ద భవనాలు నిర్మింపబడ్డాయి. వీరికి భారతీయులతో, చైనీయులతో దగ్గరి సంబంధాలుండేవని పురతత్వ శాస్తవ్రేత్తలకు లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ నాటికీ తమ పురాతన సంప్రదాయాలను కొనసాగిస్తూ చెప్పగోదగ్గ సంఖ్యలోనే మాయన్లు గ్వాటిమాలా తదితర ప్రాంతాలలో నివసిస్తున్నారు.
ఇక క్యాలెండర్ విషయానికి వస్తే, మాయన్లు చాలా రకాల క్యాలెండర్లు తయారుచేసి, కాలాన్ని దైవిక చక్రాలుగా భావించేవారు. వ్యవసాయ, సామాజిక, వ్యాపార, పరిపాలనా విభాగాల్లో విరివిగా వాడే ఈ క్యాలెండర్లలో మత విశ్వాసాలు విపరీతంగా పొందుపరిచిఉండేవి. వీటిలో చాలా క్యాలెండర్లు చిన్నవిగా ఉండేవి. వాటిలో జోల్కిన్ (260 రోజులకు అంతమయ్యేది), హాబ్ (365రోజులకు అంతమయ్యేది) ముఖ్యమైనవి. ఈ రెండింటినీ కలిపి 52 హాబ్‌లు(దాదాపు 52 సంవత్సరాలు)గా ఉండే ఒక పెద్ద క్యాలెండర్ చక్రాన్ని తయారుచేశారు.
అయితే ఎంత చేసినా 52 సంవత్సరాలకంటే ఎక్కువగా చరిత్రను నమోదుచేయలేకపోవడంతో వారు మరింత కృషిచేసి ఎట్టకేలకు హాబ్ క్యాలెండర్ చక్రాన్ని(52సం) విస్తరించగలిగారు. 13 మరియు 20 సంఖ్యలను అమితంగా ఇష్టపడే మాయన్లు వాటిని మూలంగా చేసుకుని అతిపెద్ద క్యాలెండర్ తయారుచేశారు. అదే 5126 సంవత్సరాల సుదీర్ఘ గణన క్యాలెండర్. దీని ప్రకారం వారి సంవత్సరానికి 18 నెలలు, నెలకి 20 రోజులు. ప్రతీరోజుకీ ఓ పేరు. ఈ విధంగా సంవత్సరానికి 360 పేరున్న రోజులు ఓ అయిదు పేరులేని రోజులు కలిపి మనలాగే 365 రోజులు ఉండేవి.
వారి తేదీ 0.0.0.0.0 దగ్గర మొదలయ్యి 13.0.0.0.0 వద్ద అంతమవుతుంది. అంటే సరిగ్గా 5126 సంవత్సరాలు. 0.0.0.0.0 మాయన్ తేదీని మన క్యాలెండర్‌తో వెనక్కి లెక్కవేస్తే మాయన్ క్యాలెండర్ మొదలయిన రోజు క్రీ.పూ 3114 ఆగస్టు 11. అక్కడినుండి 5126 సంవత్సరాలను(తేది13.0.0.0.0 వరకు) లెక్కిస్తే ఆ రోజే 21 డిసెంబర్, 2012. ఇదీ విషయం. సాధారణంగా ఏదైనా అంతమవుతూందంటే దానికి విపరీతార్థం తీయడం ప్రజలకు అలవాటు. అలాగే క్యాలెండర్ అంతమయ్యే రోజున ఏదో ఒక చెడు జరుగుతుందని మాయన్లు నమ్మేవారు.
అదిగో ఆ అలవాటు, నమ్మకమే ఈ ప్రళయమనే అసంబద్ధ వాదనకు పునాది. మన గోడపై ఉన్న క్యాలెండర్ కూడా మరో నలభై రోజుల్లో అంతమైపోతుంది. తర్వాత? 01-01-2010తో ఒక కొత్త క్యాలెండర్ ప్రత్యక్షమవుతుంది. ఇది కూడా అంతే. మాయన్ల మరో సుదీర్ఘ గణన క్యాలెండర్ చక్రం మొదలవుతుందే తప్ప ప్రళయం సంభవించి ఈ భూగ్రహం నాశనం అయ్యే ప్రసక్తే లేదు.
గ్రహకూటమి:
ఇది కొంచెం సంక్లిష్టమైన అంశం. మన సౌర కుటుంబం పాలపుంత(మిల్కీవే గెలాక్సీ)లో భాగమని చాలామందికి తెలుసు. మనలాంటి సౌరకుటుంబా లు కొన్ని కోట్ల సంఖ్యలో ఈ గెలాక్సీలో ఉన్నాయి. వాటన్నింటితోపాటు మనది కూడా పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి(చిత్రం చూడండి).
గెలాక్సీ కేంద్రం నుండి దాదాపు 30,000 కాంతిసంవత్సరాల దూరంలో మనం ఉన్నాం. ఇదే దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ 225-250 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి మన సౌరకుటుంబం పాలపుంత కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూంటుంది. అలాగే మన భూమికూడా సూర్యుని చుట్టూ తిరుగుతూఉంది. అయితే పాలపుంతను బల్లపరుపుగా చూసినప్పుడు సన్నగా ఒక గీతలా కనబడుతుంది. పాలపుంతలో పరిభ్రమిస్తున్న మన సౌర కుటుంబాన్ని ఇలా చూసినప్పుడు ఆ పాలపుంత మధ్య రేఖకు క్రిందకు మీదకు కదులుతూఉంటుంది
అలా కదులుతున్నపుడు ఒకసారి సరిగ్గా రేఖమీదకు వస్తుంది. అప్పుడు మన సౌరకుటుంబం, పాలపుంత కేంద్రం బల్లపరుపుగా చూసినప్పుడు ఒకే లైన్ మీద ఉంటాయి. మన సౌర కుటుంబంలో కూడా సూర్యుడు, భూమి ఇలాగే ఒకే లైన్మీదకు అదే సమయంలో (సౌరకుటుంబం, పాలపుంత కేంద్రం ఒకే లైన్ మీద ఉన్నప్పుడు)వచ్చినపుడు అన్నీ (భూమి, సూర్యుడు, గెలాక్సీ కేంద్రం) ఒకే రేఖపై అమరివుంటాయి. అయితే 2012లో భూమి ఈ గెలాక్టిక్ రేఖను దాటే అవకాశం లేదు. ఆఖరుసారి ఈ విధమైన కూటమి జరిగి కొన్ని మిలియన్ సంవత్సరాలయింది. అప్పుడు కూడా ఏదైనా చెడు జరిగినట్లు మన పరిశోధనలో తేలలేదు.
మామూలుగా సౌరకుటుంబ కేంద్రం(సూర్యుడు) గెలాక్సీ కేంద్రంతో 90 డిగ్రీల కోణంలో అనుసంధానించబడిఉంటుంది. కాబట్టి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న భూమి కూడా సంవత్సరానికి ఒకసారి గెలాక్సీ కేంద్రంతో ఒకే రేఖపైకి వస్తుంది. అయితే ఇది సాధారణంగా ప్రతీ డిసెంబరులో సూర్యుడు ధనూరాశిలో ఉన్నప్పుడు జరుగుతూనేఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ మామూలు విషయానికి 2012లో జరిగేప్పుడు ఎలాంటి ప్రత్యేకతా లేదు. ఒకవేళ ఇలా జరిగినప్పుడు గెలాక్సీ కేంద్రంలో ఉన్న కృష్ణ బిలం(బ్లాక్‌హోల్) తన భయంకరమైన ఆకర్షణశక్తితో భూమిని తనలోకి లాక్కోవాలంటే కుదరదు.
ఎందుకంటే వాటిమధ్య దూరం 30,000 కాంతిసంవత్సరాలు అంటే సరిగ్గా 2,83,82,19,14,17,74,24,000 కిలోమీటర్లు(ఎలా పలకాలి?). అంతదూరం కృష్ణబిలం తన ప్రభావాన్ని చూపించలేదు. భూమిపై తమ గురుత్వాకర్షణ ప్రభావాన్ని చూపించగలిగేవి సూర్యుడు, చంద్రుడు మాత్రమే. కాబట్టి కుహనా మేధావులు చేసే ఈ వాదన కూడా నాన్సెన్స్.
ధ్రువ మార్పిడి:
మరో విచిత్రమైన వాదన భూఅయస్కాంత ధ్రువ మార్పిడి లేదా ధ్రువ మార్పిడి. నిజానికి ఇవి రెండు వేర్వేరు అంశాలు. అయస్కాంత ధ్రువ మార్పిడి భూమి భౌతికంగా ఎలాంటి మార్పు లేకుండా కేవలం అయస్కాంత శక్తి మాత్ర మే అటుఇటు మారిపోవడం. ఇక ధ్రువ మార్పిడి అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగానూ, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువంగానూ భౌతికంగా మారి పోవడం. భూగోళం తూర్పు పడమరలను అక్షంగా చేసుకుని, ఒక సగం రౌండు తిరిగి పోతుందన్నట్టు. భూకేంద్రకం మాత్రం అలాగే ఉండి, దానిపైన ఉన్న ఉపరితల పొర (దాదాపు ఉపరితలం నుంచి 30 కిలోమీటర్లు లోతు వరకు) తిరిగిపోయి ధ్రువ మార్పిడి జరగడం. అయస్కాంత ధ్రువ మార్పిడి అనేది సాధారణంగా జరిగే అంశం.
ఒకప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఉత్తర ధ్రువం ఇప్పుడు కెనడాపై ఉంది. పూర్తిగా ఉత్తరం దక్షిణంగానూ, దక్షిణం ఉత్తరంగానూ (అయ స్కాంత శక్తి పరంగా) మారడానికి దాదాపు 4,00,000 సంవత్సరాలు సగటున పడుతుందని పరిశోధనలో తేలింది. అలాంటి మార్పు ఒకవేళ జరిగినా మానవాళికి వచ్చిన ముప్పేమీలేదు. రాబోయే కొన్ని వేల సంవత్సరాలలో ఇది జరిగే అవకాశం చాలా తక్కువ. ఇక ధ్రువ మార్పిడి. అకస్మాత్తుగా భూమి తిరిగి పోవడం అనేది పూర్తిగా అసాధ్యం. ఇంతవరకు అలా జరుగలేదు. జరిగే అవకా శం లేదు. అయితే ఖండాలు కొద్దికొద్దిగా జరుగడం అనేది ఉంది (కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటార్కిటికా భూమధ్యరేఖకు దగ్గరగా ఉండేది). దీనికి ధ్రువమార్పిడికి అసలు ఏమాత్రం సంబంధమే లేదు. ఏరకంగా చూసినా ఇది సాధ్యం కాదు. తద్వారా భూమికి వచ్చే ప్రమాదమేదీ లేదు.
గ్రహఘాతం:
ఇక మరో ఘాతుకం ఈ గ్రహఘాతం లేదా పర గ్రహ తాకిడి. బాహ్య సౌర వ్యవస్థ నుంచి వచ్చే ‘నిబిరు’ అనే గ్రహం మన సౌర కుటుంబంలోకి వచ్చి భూమిని ఢీకొట్టడం లేదా అతిదగ్గరనుంచి వెళ్లిపోవడం, తద్వారా భూమి సర్వనాశనం కావడం. ఈ వాదన పూర్తిగా అసంబద్ఢం.
ఈ వాదన పుట్టడానికి కారణం ముగ్గురు కుహనా రచయితలు, మేధావులు. వారు నాన్సీ లీడర్, జకారియా సిచిన్, మార్క్హాజిల్వుడ్. ఇందులో జకారియా సిచిన్ అనే రచయిత సుమేరియన్ల పురాతన మెసపటేమియన్ నాగరికత గురించి రచనలు చేసాడు. వాటిల్లో తాను సుమేరియన్ల పరిశోధన తాలూకు పత్రాలు సంపాదించానని, అందులో ‘నిబిరు’ అనబడే గ్రహం గురించి ఉందనీ, అది ప్రతి 3600 సంవత్సరాలకొకసారి సూర్యుడి చుట్టూ పరిభ్రమి స్తుంటుందని తెలిపాడు.
ఈ వాదనకు తోడైన నాన్సీలీడర్ అనే ఒక మహిళ తను చిన్నపిల్లగా ఉన్నపుడు తనను జెటాలు అనబడే గ్రహాంతరజీవులు కలుసుకుని, తన మెదడులో ఒక సమాచార పరికరాన్ని నిక్షిప్తం చేశారని, తద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు తనను కాంటాక్ట్ చేస్తారని తెలిపింది. ఆవిడ ‘జెటా టాక్.కామ్’ అనే ఒక వెబ్‌సైట్‌ను కూడా 1995లో ప్రారంభించింది. తన కథ నాల ప్రకారం భూమికి నాలుగురెట్లు పెద్దగా ఉండే ఒక గ్రహం (ప్లానెట్ ఎక్స్) భూకక్ష్యలోకి ప్రవేశించి, 27మే, 2003న భూభ్రమణాన్ని 5.9రోజులపాటు అపేస్తుందని జెటాలు అనబడే గ్రహాంతరవాసులు తనకు తెలియజేసారని ప్ర టించింది.
మామూలుగా మే27న ఏమీ జరుగలేదు. దాన్ని కప్పిపుచ్చు కోవడానికి ఆమె మరో ప్రకటన చేస్తూ యదార్థతేదిని ప్రకటిస్తే ప్రభుత్వాలు ఎమ ర్జెన్సీ విధించి, ప్రజలను నానా కష్టాలకు గురిచేస్తాయనే తాను తప్పుడు ప్రకటన చేసినట్లు చెప్పింది. ఇప్పటికీ ఆమె వెబ్సైట్ ఉంది. 2001లో మార్క్హాజిల్వుడ్ అనే జెటాటాక్ సభ్యుడు పై రెండు విషయాలను కలగలిపి ఈ ప్లానెట్ ఎక్సే ఆ నిబిరు అని ప్రకటించేశాడు. 2003లో ఏమీ జరుగకపోయేసరికి ఈ ప్ర.వాలు ఆ ముహుర్తాన్ని కాస్తా 2012కి మార్చి ఈ భయోత్పాతానికి కారణభూత మయ్యారు.
నిజానికి సుమేరియన్లు క్రీ.పూ 23వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు జీవించారు. వారు చాలా ఉన్నతమైన ప్రతిభాపాటవాలు కలిగినవారు. వారు వ్యవసాయం, నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ప్రత్యేకించి లిపి లో అసా దారణ ప్రజ్ఞ కలిగిఉండేవారు. అయితే నిబిరు గ్రహం వారికి తెలిసే అవకాశం లేదని, వారిపై, వారి నాగరికతపై అసమాన పరిశోధనలు సాగించిన చరిత్ర కారులు(సిచిన్ లాంటి వాళ్లు కాదు) తేల్చారు. అంతేకాదు వారికి ఖగోళశాస్త్ర పరిజ్ఞానం చాలా తక్కువ . కనీసం సూర్యుడి చుట్టూ మన గ్రహాలు తిరుగు తాయన్న విషయం కూడా వారికి తెలియదు. ఆ విషయం బయటపెట్టింది సుమే రియన్ల శకాంతం తర్వాత 2000 సంవత్సరాలకు గ్రీకులు. నిబిరు అనేది బాబి లోనియన్ నాగరికతకు సంబంధించి ఒక పద్యంలోని పాత్ర మాత్రమే.
ఆ నిబిరు ఇప్పుడు వచ్చేసి భూమిని ఢీకొట్టడమనేది పూర్తిగా అబద్ధం. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఇప్పుడు కాదు, కనీసం పదిహేనేళ్ల క్రితమే అది మన కంటబడిఉండాలి. ఉదాహరణకి గురుగ్రహాన్ని(జుపిటర్) తీసుకోండి. భూమికంటే దాదాపు పది రెట్లు పెద్దది. సగటున అది భూమికి 75కోట్ల కిలో మీటర్ల దూరంలో ఉంది. అయినా మన భౌతిక నేత్రానికి చాలా స్పష్టంగా కనబ డుతుంది. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు(వీనస్)ల తర్వాత చాలా ప్రకాశ వంతమైన గ్రహమది. ఒకవేళ నిబిరు కనుక ఇక్కడే(మన సౌర వ్యవస్థలో) దశా బ్దకాలంనుంచి ఉంటే దాని దూరం 100 కోట్ల కిలోమీటర్ల కన్నా ఎక్కువుం డివుండ కూడదు. అంత దూరంనుంచి కూడా మనకది కనబడితీరాలి.
scientistపోనీ అది గురువు కన్నా ప్రకాశవంతం కాదనుకున్నా చాలా సులువుగా మనకు కనబడాలి. ఆ స్థాయి పరికరాలు మనకున్నాయి. గుర్తుంచుకోండి, ప్లుటో చాలా చిన్న గ్రహం. పైగా అది 500కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినప్పటికీ మన టెలిస్కోపులలో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నిబిరు లాంటి పెద్ద (భూమికంటే నాలుగురెట్లు పెద్దదన్నారు..!) గ్రహం ఇంతకాలంపాటు ఖగోళ శాస్తవ్త్రేత్తల కన్నుగప్పే ప్రసక్తే లేదు. ఒకవేళ కొందరు(లీడర్, హాజిల్‌వుడ్‌ల లాగా) అనుమానిస్తున్నట్లు వివిధ దేశాల ప్రభుత్వాలు తమతమ ఖగోళ పరిశోధనా సంస్థలు కనుక్కున్న ఈ విషయాన్ని ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దాయాలనుకున్నా, ఔత్సాహికులైన నూతన ఖగోళ పరిశోధకులు దాయలేరు.
వారికున్న ఉత్సుకత అలాంటిది. గత పది, ఇరవై సంవత్సరాలలో చాలా తోకచుక్కలు, మరుగుజ్జు గ్రహాలు కనుగొనబడ్డాయి. వాటిల్లో ఏదీ ప్లానెట్ ఎక్స్ లేదా నిబిరు కాదు. పైగా అవన్నీ సుదూర తీరాలలో ఉన్నాయి. సాధారణంగా శాస్తవ్రేత్తలు ఏదైనా కొత్త గ్రహాన్ని కనుక్కుంటే దానిపై పరిశోధన వూర్తయేంతవరకు దాన్ని ‘ప్లానెట్ ఎక్స్’గా వ్యవహరిస్తారు. తరువాత దానికి ఒక పేరు పెట్టి తర్వాతనుండి ఆ పేరుతో పిలుస్తారు. ప్లుటోను, నెప్ట్యూన్‌ను కూడా మొదట్లో ప్లానెట్ ఎక్స్గానే పిలిచేవారు.
scientistఈ మధ్య కాలంలో బాహ్య, అంతర సౌరవ్యవస్థలలో ఎటువంటి గ్రహం లేదా గ్రహంలాంటి పదార్థమేది కనబడలేదని నాసా, ఇస్రో, ఇఎస్ఓ లాంటి ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనాసంస్థలు బాహాటంగా ప్రకటించాయి. భూమిపై వివిధ ప్రదేశాలలో ఉన్న వివిధ దేశాల వేధశాలలు, టెలిస్కోపులు నిరంతరం అంతరిక్షాన్ని వేయి ‘కళ్లతో’ కాపలా కాస్తున్నాయి. ఇంత పెద్ద నెట్‌వర్క్‌ను తప్పిం చుకుని వచ్చి భూమిని ఢీకొట్టే అవకాశం ఏ గ్రహానికి లేదు. ఇంటర్నెట్లో విహ రిస్తున్న ఫోటోలు కేవలం ఫోటోషాప్ ఎఫెక్టులతో సృష్టించినవి లేదా సూర్యున్ని ఫోటో తీసినప్పుడు వచ్చిన కటక భ్రమ ప్రభావం మాత్రమే. కాబట్టి నిబిరు లేదా ప్లానెట్ ఎక్స్ అనే గ్రహం లేదా పదార్థమేదీ లేదు. అందువల్ల మనకొచ్చే ప్రళ యమూ అసలే లేదు.
ఇక గ్రహశకలాలు, మీటియర్స్ లేదా ఆస్టరాయిడ్లు. సాధారణంగా చాలా చిన్న గ్రహశకలాలు ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భూవాతావరణంలోకి ప్రవేశించి మాడిమసైపోతుంటాయి. ఓ మోస్తరు పెద్ద సైజువి మాత్రమే భూమిని ఢీకొట్టగల స్థితిలో ఉంటాయి. కాని ఇవి చాలా అరుదు. గతంలో జరిగిన అతి పెద్ద ఆస్టరాయిడ్ ప్రమాదం 65 మిలియన్ సంవత్సరాల క్రితం నమోదయింది. దానివల్ల ఈ భూమిపై డైనోసార్ల శకం అంతమయింది. అప్పుడు ఆ గ్రహశకలం ఇప్పుడు మనం ఉన్న భారతదేశంపైనే పడింది. పడమరవైపున ఉన్న బొంబాయి తీరంలో తాకిన ఈ శకలం దాదాపు 500 కిలోమీటర్ల వెడల్పున గొయ్యిని ఏర్పరి చింది. ఆ గ్రహశకలానికి లయకారకుడైన హిందూ దైవం శివుడి పేరుమీద ‘శివ’ అనీ, దీనివల్ల ఏర్పడిన గొయ్యికి ‘శివ క్రేటర్’ అనీ నామకరణం చేసారు దాన్ని కనుగొన్న శంకర్ చటర్జీ అనే భారతీయ శాస్తవ్రేత్త.
ఇటీవల ఇండోనేషియా ఆకాశంలో 2009 అక్టోబర్ 8న ఒక గ్రహ శకలం పేలిపోయింది. అది దాదాపు 5 నుంచి10 మీటర్ల పొడవుందని తేల్చారు. భూమి చుట్టూ తిరుగాడుతూ ప్రమాదకరంగా ఉన్న గ్రహశకలాలను పరిశీలిం చేందుకు నాసా ‘స్పేస్గార్డ్ సర్వే’ పేరుతో ఒక పరిశోధన నిర్వహిస్తోంది. భూమిని ఢీకొట్టి ప్రళయానికి కారణమయ్యేంత ఆస్టరాయిడ్లు (శివ లాంటివి) ఏవీ దరిదా పుల్లో లేవని ఇప్పటికే అన్ని దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పా యి. నాసా వారి ‘నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్(నియో)’ కార్యక్రమం వెబ్సైట్లో ఈ సమాచారమంతా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు కూడా. నాసా, ఇంకా ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థల అంచనా ప్రకారం భూమికి ఇంకా 400కోట్ల యేళ్ల వరకు ఎలాంటి ప్రమాదమూ లేదు.
సౌర తుపానులు:
ఇందులో కొంత నిజం లేకపోలేదు. సూర్యుడిపై ప్రతిదినం నిరంతర చర్యలు జరుగుతూనేఉంటాయి. బాగా ఎక్కువగా జరిగినప్పుడు గరిష్ట సౌర తుపాను (సోలార్ మాగ్జిమం)గానూ, తక్కువగా జరుగుతున్నపుడు కనిష్ట సౌర తుపాను (సోలార్ మినిమం) గాను వ్యవహరిస్తారు. రెండు సోలార్ మాగ్జిమంల మధ్య వ్యవధి దాదాపు 11 సంవత్సరాలుంటుంది. గతంలో 2001వ సంవ త్సరంలో సోలార్ మాగ్జిమం వచ్చింది కాబట్టి ఈసారి 2012లో వచ్చే అవకాశం ఉంది.
1 comment:
Thammi ekkadi nundi copy chesavu ?? any way nice one
Post a Comment